వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్ ప్రకారం బంగాళాఖాతంలోని వాయుగుండం మచిలీపట్నానికి 1690 కి.మీ దూరంలో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే శ్రీలంకలోని ట్రికోమలీకి 1060 కి.మీ దూరంలో, చెన్నైకి 1410కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించారు. ఇది శనివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా మారి, సాయంత్రం 5.30 గంటలకు తుపానుగా మారుతుందని, అలాగే ఈనెల 29న తెల్లవారుజామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఈనెల 30న దక్షిణ కోస్తాలో భారీ వర్షాలకు అవకాశం ఉంటుందని తెలిపారు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో శనివారం నుంచి జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని రియట్టైమ్ గవర్నెన్స్ సొసైటీ సూచించింది.
ఇప్పటికే వేటకు వెళ్లిన జాలర్లంతా ఈ నెల 28లోగా తీరానికి తిరిగి వచ్చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయని చెప్పింది. ప్రజలు కూడా తీరప్రాంతాలకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. తీరంలో ఆడుకోవడం, సముద్రస్నానాలు మానుకోవాలని స్పష్టం చేసింది.
వాయుగుండం నేడు తుపానుగా మారే అవకాశం
Share.