Advertisements

దివికేగిన రాజకీయ దిగ్గజం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ ఇకలేరు. ఆగష్టు 9న ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్పించారు. 15 రోజులపాటు చికిత్స పొందిన ఆయన.. ఆరోగ్యం విషమించడంతో శనివారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త వినగానే బీజేపీ శ్రేణులు కన్నీరుమున్నిరయ్యారు. రాజకీయాలకు అతీతంగా అనేకమంది నాయకులు అరుణ్ జైట్లీకి నివాళులర్పిస్తున్నారు. న్యాయవాదిగా మంచి మనసున్న వ్యక్తిగా ముద్రవేసుకున్న అరుణ్ జైట్లీ జీవితం ఎందరికో ఆదర్శం…

అరుణ్‌ జైట్లీ 1952 నవంబర్ 28న మహారాజ్‌ కిషన్‌ జైట్లీ, రతన్‌ ప్రభు దంపతులకు ఢిల్లీలో జన్మించారు. తండ్రి కిషన్‌ స్వస్థలం ప్రస్తుత పాకిస్థాన్‌లోని లాహోర్‌. ఆయన అక్కడ పేరు ప్రఖ్యాతులు కలిగిన న్యాయవాది‌. తల్లి రతన్‌ ప్రభుది పంజాబ్‌లోని అమృత్‌సర్‌. దేశవిభజన సమయంలో కిషన్‌ జైట్లీ ఢిల్లీలోని నారాయణ్‌ విహార్‌కు వచ్చి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అక్కడే అరుణ్‌జైట్లీ జన్మించారు. న్యూఢిల్లీలోని సెయింట్ గ్జావేరీ స్కూల్ లో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. శ్రీరామ్ కాలేజీ నుండి బీకాం డీగ్రీ పట్టాను తీసుకొన్నారు.

1977లో ఢిల్లీ యూనివర్శిటీ నుండి లా పట్టా పొందారు. ఢిల్లీలోని అత్యంత ప్రముఖ న్యాయవాదుల్లో జైట్లీ కూడా ఒకరు. పన్ను చట్టాలు, ఆర్థిక వ్యవహారాలు ఆయనకు కొట్టిన పిండి. కోర్టులో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారని పేరు. కానీ, తన గుమాస్తాల విషయంలో మాత్రం జైట్లీ ఎంతో ఉదారంగా ఉండేవారు. సిబ్బంది పిల్లల చదువులకు అవసరమైనప్పుడల్లా ఆర్థిక సాయం చేసేవారు. సిబ్బంది పిల్లల పెళ్లిళ్లకు ఢిల్లీలోని ఇంటిని వేదికగా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా మంచి మనసున్న వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు.

ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకొనే సమయంలో ఆయన ఏబీవీపీలో కీలక నేతగా ఎదిగారు. 1974లోనే ఆయన ఢిల్లీ యూనివర్శిటీకి అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఆ సమయంలో రాజ్ నారాయణ్, జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన అవినీతి వ్యతిరేకగా ఉద్యమంలో విద్యార్థి సంఘం నాయకుడిగా కీలక భూమిక పోషించారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీలో చేరారు. 1987 నుండి పలు రాష్ట్రాల హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. 1990 లో ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గా నియమితులయ్యారు.

అలాగే 1991 నుండి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అరుణ్ జైట్లీ ఉన్నాడు. 1999 బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. అలాగే 2000 లో కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. 2002లో జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. 2003లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో బీజేపీ ఓటమి పాలైంది. 2004-2009 వరకు రాజ్యసభలో బీజేపీ పక్షనేతగా ఆయన పనిచేశారు.2014లో అమృత్ సర్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ప్రస్తుత పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 2019లో ఆయన పోటీకి దూరంగా ఉన్నాడు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: