గత కొద్ది రోజులుగా ఆర్టికల్ 370 రద్దు పై ఎన్నో వాదనలు చర్చలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు సమర్దిస్తుంటే మరి కొందరు మాత్రం ససేమిరా అంటున్నారు వాళ్ళ పూర్తి వ్యతిరేకతను వ్యక్తబరుస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దుపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ రద్దుని సమర్దించేవారికి వ్యతిరేకించే వారికి మధ్య అనేక వాదనలు సంభాషణలు జరుగుతున్నాయి సుప్రీం కోర్టులో కూడా ఇప్పటికే అనేక పిటిషన్లు ధాఖలు అయ్యాయి.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది. వీటిపై అక్టోబర్ మొదటివారంలో ధర్మాసనం విచారణ చేపడుతుందని సుప్రీం వెల్లడించింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి, జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగానికి నోటీసులు జారీచేసింది.
ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్ల పై సుప్రీం బుధవారం నాడు కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడంతో కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు నోటీసుల వల్ల ‘సీమాంతర పరిణామాలు’ ఎదురవుతాయని, న్యాయస్థానంలో జరిగే వాదనలు ఐక్యరాజ్యసమితి వరకు చేరుతాయని వారు పేర్కొన్నారు. కేంద్రానికి నోటీసులు జారీ చేయవలసిన అవసరం లేదని వారు పేర్కొన్నారు. దీనికి స్పందించిన సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ‘ఏం చేయాలో మాకు తెలుసు. మేం ఆదేశాలు జారీ చేశాం. వాటిని మార్చడం లేదు’ అని తేల్చి చెప్పారు.