గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కోడెల శివ ప్రసాద్ అనేక వార్తా పత్రికల్లో చర్చల్లో ప్రధానంగా నిలుస్తున్నారు. ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ తన ఇంట్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పలు ఆసక్తికర విమర్శలు చేశారు. బుధవారం దేశరాజధాని ఢిల్లీ లో జరిగిన స్పీకర్ల సమావేయశానికి హాజరయిన సీతారాం మాజీ స్పీకర్ కోడెల పై పలు ఆసక్తికర విమర్శలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. మాజీ స్పీకర్ కోడెల పై వచ్చిన ఆరోపణలు వినడం బాధాకరం. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఫర్నీచర్ ను సొంత ఇంటికి తరలించడం దురదృష్టకరం. అది స్పీకర్ వ్యవస్థకు మచ్చగా మిగిలిపోతుంది. కోడెల వ్యవహారంపై విచారం మాత్రమే వ్యక్తపర్చగలను తప్ప ఇంక ఎక్కువ మాట్లాడదలచుకోలేదన్నారు. ఈ వ్యవహారం పై ప్రభుత్వం స్పందించినపుడల్లా కక్ష సాధింపు చర్య అంటూ ప్రతివాధానాలు వినిపిస్తున్నాయి. ఇలా వస్తున్న వార్తలు వినడం సరికాదు అని ఆయన చెప్పుకొచ్చారు. కక్ష సాధింపు అని ప్రతిపక్షం అంటుంది కానీ ఏపీలో ఏ ఒక్క పౌరుడితో అయినా ఇదే మాట అనిపిస్తే నేను ఈ వ్యవస్థ నుంచి తప్పుకుని వెళ్లిపోతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.