‘దేశ భాషలయందు తెలుగు లెస్స’ అన్నారు కవులు. తెలుగు భాష ఒక అద్భుతమైన, మధురమైన భాష. మాధుర్యానికి, స్పష్టతకి తెలుగు భాష వారధయితే పాండిత్యానికి ఔన్నత్యానికి తెలుగు భాష పుట్టినిల్లు. తెలుగు భాష తియ్యదనాన్ని ప్రపంచ నలుములాలకి వ్యాపించి కీర్తింపజేసిన కవులు మహానుభావులు. అలాంటి ఒక గొప్ప కవే కీర్తిశేషులు గిడుగు రామమూర్తి పంతులు గారు. నేడు ఈయన పుట్టిన రోజు, ఈయన పుట్టిన రోజుని సత్కరించుకుంటూ తెలుగు జాతి ‘తెలుగు భాషా దినోత్సవము’ జరుపుకుంటుంది. గిడుగు గారు తెలుగు వ్యావహారిక బాషకు పితామహుడిగా పరిగణించబడతారు. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగమశాసనుడు అనే బిరుదు కలదు.
తెలుగు ప్రజలు స్మరించదగ్గ ప్రథమ స్మరణీయుడు గిడుగు రామమూర్తి. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్టవ్యావహారికం”లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయికపండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునికప్రమాణభాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి. గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. రచనావైవిధ్యం, వైశిష్ట్యంతో పుష్టిచేకూరింది. విశ్వవిద్యాలయాలలో వాడుకభాష రాజ్యమేలుతోంది. పత్రికలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అక్షరాస్యత పెరిగింది. తెలుగు అధికారభాషగా, పరిపాలనా భాషగా కీర్తికెక్కింది. దీనికంతటికీ గిడుగు పిడుగే మూలకారకుడు.

gidugu ramamurthy
ఈలంటి గొప్ప మహానుభావుడిని స్మరించుకుంటూ తెలుగు తల్లికి వందనాలు తెలుపుతూ ‘తెలుగు భాషా దినోత్సవము’ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ తెలుగు భాష ని ప్రేమించాలని, ఉపయోగించాలని కొత్త వారికి భాషని నేర్పించాలని కోరుకుంటుంది మహా న్యూస్.