నేటితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నాడు. కొందరు ఆయన పాలన పై ప్రభుత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు కొందరు విమర్శలు కురిపిస్తున్నారు. హర్షాలు వ్యక్తమవుతున్నాయి దూషణలు వ్యక్తమవుతున్నాయి. ఇక పోతే నేడు సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలోని పలాస లో కిడ్నీ రీసర్చ్ సెంటర్ పనులు ప్రారంబించడానికి వెళ్ళి అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన పై ప్రశంసల జల్లు కురిపించాడు ఆ పార్టీ ఎమ్మెల్యే ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.
ఇలాంటి సీఎం మరొకరు లేరని రారని జగన్ కి కితాబు ఇచ్చారు. ఓ పక్క జగన్ పై ప్రశంసలు చేస్తూనే మరో పక్క ప్రతిపక్ష అధినేత చంద్రబాబు పై విమర్శలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ వాగ్దానాలను నిలబెట్టుకున్నారనీ, ఆయన రాకతో పలాస ప్రాంతం పునీతమైందని వ్యాఖ్యానించారు. ఉద్ధానంలోని కిడ్నీ సమస్యను పరిష్కరిస్తామని ఎందరో ముఖ్యమంత్రులు వచ్చివెళ్లారనీ, ఎవ్వరూ చేయలేకపోయారని గుర్తుచేశారు. కానీ పాదయాత్రలో ఉద్ధానం సమస్యను గుర్తించిన జగన్.. హామీ ఇచ్చారనీ, ఈరోజు 200 పడకల ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన సామాజికవర్గాలు ప్రజలు అధికమన్నారు. పలాస ప్రజలు వెనుకపడిన తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, జగన్ తనను ఏకంగా శాసన సభాపతిగా చేశారని హర్షం వ్యక్తం చేశారు.
పాదయాత్ర సమయంలో జగన్ విన్న సమస్యలని కనులారా చూసిన సమస్యలని మర్చిపోలేదని.. అప్పుడు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకున్నారని ఆయన వ్యాక్యానించారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రం లో మళ్ళీ వానలు కురుస్తున్నాయని.. మళ్ళీ రాజన్న రాష్ట్రాన్ని చూస్తునట్టుగా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘జగన్ మోహన్ రెడ్డి, రాజశేఖరెడ్డి ఉన్నప్పుడు వర్షం రాదంటే వార్త అవుతుంది. వర్షం వస్తే అసలు అది వార్తే కాదు. వరుణదేవుడు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. నేనీ మాట చెప్పకూడదు కానీ. కరవు-చంద్రబాబు నాయుడు కవల పిల్లలు. వరుణుడు-వైఎస్సార్ కుటుంబం బాంధవ్యంతో కూడుకున్న వ్యక్తులు. ఈరోజు వర్షం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నా ప్రసంగాన్ని ముగిస్తున్నా జైహింద్.. జై జగన్’ అంటూ తమ్మినేని ముగించారు.