పవన్ కళ్యాణ్ తో వీహెచ్ భేటీ..ఎందుకంటే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరపాటు పవన్ కళ్యాణ్ తో పలు అంశాలపై చర్చించారు వి.హనుమంతరావు. పార్టీ ఫిరాయింపులు, కాపు రిజర్వేషన్ల అంశం, తెలుగు రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో యురేనియం తవ్వకాలను నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నిరసనలకు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ను వీహెచ్ కోరినట్లు సమాచారం.

అనంతరం ఇరువురూ మీడియా సమావేశంలో మాట్లాడారు. తొలుత పవన్ మాట్లాడుతూ.. శ్రీశైలం, నల్లమల అటవీ ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలు పర్యావరణాన్ని, చెంచుల జీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా పులుల సంరక్షణకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తామని, రెండుమూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాల పర్యవసానాలపై మేధావుల అభిప్రాయాన్ని తప్పనిసరిగా తీసుకుంటామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అనంతరం విహెచ్ మాట్లాడుతూ…పవన్ కళ్యాణ్ ఇలాంటి సమస్యలపై ప్రజల్లోకి వెళ్లగలుగుతారనే ఉద్దేశంతో ఆయన్ను కలిసినట్లు వీహెచ్ చెప్పారు. యురేనియం తెలంగాణతో పాటూ నల్లమల్ల ప్రాంతంలో తవ్వకాలు చేపడితే కృష్ణా నదిలో నీళ్లు కలుషితమవుతాయి.. ఆ నీటిని హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ప్రకాశం, కృష్ణా ప్రాంతాల వాళ్లు తాగుతారన్నారు. ఈ నీళ్లు తాగితే అందరూ అనారోగ్యం పాలవుతారని.. పొలాల్లో పంటలు కూడా పండవన్నారు. అందుకే పవన్ కళ్యాణ్‌ను కలిశామని.. ఆయన కూడా సానకూలంగా స్పందించారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: