తెలుగుదేశం పార్టీని వరుస మరణాలు వెంటాడుతున్నాయి…ఇటీవలే మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి ఇంకా కోలుకొని టీడీపీ నేతలకు ఇప్పుడే మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న అయన.. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ శివప్రసాద్ ఆరోగ్యం మరింత క్షిణించడంతో కన్నుమూశారు.
శివప్రసాద్ సొంతూరు చిత్తూరు జిల్లాలోని పూటిపల్లి, 1951 జూలై 11న అప్పటి మద్రాస్ రాష్ట్రంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. స్వతహాగా రంగస్థల నటుడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. అనంతరం సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అయన రెండుసార్లు చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. 2009, 2014లో ఆయన చిత్తూరు ఎంపీగా ఉన్నారు. స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలిపారు. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారీ.. రకరకాల వేషధారణల్లో నిరసనలు తెలిపేవారు. దీంతో ఓ దశలో ఆయన జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించారు.